
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు
నకరికల్లు: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పలు ప్రాంతాలలో అమ్మకాలు చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. నకరికల్లు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని చల్లగుండ్ల పరిధిలో గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్‌ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నున్న 10 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు, విశాఖపట్నం సాలిపేటకు చెందిన పెంటకోట శంకరరావు, నకరికల్లుకు చెందిన కగ్గా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల పులిచింతల నిర్వాసిత గ్రామానికి చెందిన కాపర్తి మల్లిఖార్జునరావు, బిహార్ రాష్ట్రానికి చెందిన అగయ్య వినోద్‌యాదవ్, నకరికల్లు మండలానికి చెందిన బాణావతు బాలానాయక్, రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంకు చెందిన సాదుపాటి శ్రీనివాసరావు, కొండమోడు గ్రామానికి చెందిన బండారు హనుమంతరావు, ఆవుల పెద్దసాంబయ్యలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. నర్రా హనుమంతరావు, పెంటికోట శంకరరావులు కలసి ఒడిశా నుంచి విశాఖపట్నం ప్రాంతాలకు గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారన్నారు.
తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారినుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం