
జయ మంగళం
విజయదశమి రోజున భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి వరద నేపథ్యంలో ఆదిదంపతుల నదీ విహారం రద్దు హంసవాహనంపై పూజలతో సరి దుర్గమ్మ సన్నిధికి కొనసాగుతున్న భవానీల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రాకతో కృష్ణమ్మ పులకించింది. దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదిదంపతులకు హంస వాహన సేవ జరిగింది. కృష్ణానది వరద నేపథ్యంలో శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఏటా నిర్వహించే నదీ విహారాన్ని రద్దు చేశారు. హంస వాహన సేవను మాత్రమే నిర్వహించగా, సేవను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది తీరానికి చేరుకున్నారు. హంస వాహనంపై అధిష్టించిన ఆదిదంతులకు ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. హంస వాహనంపైకి ఆలయ ఈవో, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ దంపతులతో పాటు వేద పండితులు, ఆలయ అర్చకులను మాత్రమే అనుమతించారు. హంస వాహనంపై కొలువు తీరి పూజలందుకుంటున్న ఆదిదంపతులను ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్, దుర్గగుడి ఫ్‌లైవోవర్, భవానీ ఘాట్ల నుంచి భక్తులు దర్శించుకున్నారు. సాయం సంధ్య వేళ దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు నవ హారతులను ఇవ్వగా, అదే సమయంలో హంస వాహన సేవ జరిగింది. ఒకే సమయంలో రెండు సేవలను వీక్షించే మహాభాగ్యం భక్తులకు కలిగింది.
క్యూలైన్ల ద్వారానే..
భవానీలు, భక్తుల రాకతో మరో రెండు రోజులపాటు ఉత్స వ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొ న్నారు. శని, ఆదివారాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు క్యూలైన్ల ద్వారానే కొండపైకి చేరుకోవాలని సూచించా రు. అంతే కాకుండా వీఐపీ దర్శనాలు ఉండవని పేర్కొన్నారు.
కనులపండువగానగరోత్సవ సేవ
హంసవాహన సేవ కోసం ఆది దంపతులు దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మల్లేశ్వరస్వామి వారి ఆ లయం సమీపంలోని యాగశాల నుంచి ప్రారంభమవగా.. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, దుర్గాఘాట్‌కు బయలుదేరింది. ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో హంస వాహనంపైకి కేవలం 25 మందిని మాత్రమే అనుమతించారు.

జయ మంగళం