
ఉత్తమ పద్యనాటకం ‘ఆదికవి నన్నయభట్టు’
తెనాలి: వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు–2025 ఘనంగా ముగిశాయి. ఇక్కడి తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరు రోజులపాటు జరిగిన పద్యనాటక, సాంఘిక నాటక, నాటిక పోటీల ముగింపు సభ గురువారం రాత్రి జరిగింది. ఈ సభలో బహుమతులను ప్రదానం చేశారు. పద్యనాటక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్– విజయనగరం సమాజం ప్రదర్శించిన ‘ఆదికవి నన్నయభట్టు’ నాటకం ఎంపికై ంది. దీనికి ఉత్తమ రచన బహుమతిని కూడా శారద ప్రసన్న స్వీకరించారు. నన్నయ భట్టుగా నటించిన కె.సూర్యనారాయణకు ఉత్తమ నటుడిగా నిలిచారు.
‘మెహినీ భస్మాసుర’కు అవార్డుల పంట
ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా అక్కినేని సాంస్కృతిక సమాజం వారి ‘మోహినీ భస్మాసుర’ నాటకం ఎంపికై ంది. భస్మాసురుడిగా నటించిన డి.తిరుపతినాయుడు ఉత్తమ ప్రతినాయకుడు బహుమతిని, మోహినీగా నటించిన కేవీ పద్మావతి ఉత్తమ నటిగా, నారదుడు పాత్రధారి గవర సత్తిబాబు ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా బహుమతులను గెలుచుకున్నారు. ఇదే నాటకానికి ఉత్తమ సంగీతం బహుమతిని కంది త్రినాథరావు అందుకున్నారు.
సత్తా చాటిన కళాకారులు
చందాల కేశవదాసు కళాపరిషత్ – మధిర వారు ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ నాటకానికి తృతీయ ఉత్తమ బహుమతి లభించింది. దీనికి దర్శకత్వం వహించిన ఎన్.సుబ్బరాజు ఉత్తమ బహుమతిని గెలుచుకున్నారు. పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు, లలిత కళాపరిషత్ – అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ నాటకానికి ఉత్తమ రంగోద్దీపనం బహుమతిని సురభి రాయల్ స్వీకరించారు. టీజీవీ కల్చరల్ అకాడమీ – కర్నూలు వారు ప్రదర్శించిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ నాటకానికి ఉత్తమ ఆహార్యం బహుమతిని సి.శ్రీనివాసులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటి బహుమతిని ’పుత్రాదిచ్ఛేత్’ నాటకంలో నాగులాంబ పాత్రధారి ఎన్.తిరుమల కై వసం చేసుకున్నారు. ఉత్తమ హాస్యనటిగా ‘జగదేకసుందరి సామా’లో హసీనా, ఉత్తమ బాలనటుడిగా ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో బాలవెంకటేశ్వరుడు గెలుచుకున్నారు.
సాంఘిక నాటక విభాగంలో ...
సాంఘిక నాటక విభాగంలో ఉత్తమ ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్– వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ నటి సురభి లలిత, ఉత్తమ ప్రతినాయకురాలు (నల్లత్రాచు నీడలో)ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా జయకళానికేతన్ – విశాఖపట్నం వారి ‘సిరికేళి’ నాటకం ఎంపికై ంది. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటుడిగా బహుమతులను జరుగుల రామారావు (అందరూ మంచివారే...కానీ), ఉత్తమ రచన శ్రీశైలమూర్తి (యాగం) అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్నీ బ్రతకనివ్వండి’ గెలుచుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు బహుమతులు లభించాయి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా పరమాత్ముని క్రియేషన్స్ –హైదరాబాద్ వారి ‘ఎక్కడో...ఏదో’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు ఉత్తమ రచన బహుమతి లభించింది. ఉత్తమ తృతీయ ప్రదర్శనగా హర్ష క్రియేషన్స్ – విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ నాటిక ఎంపికై ంది. కళల కాణాచి – తెనాలి, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవంలో అజో విభో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, నాటకరంగ విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ఆర్.శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు