
పండగ పూట పెను విషాదం
వాగులో మునిగి ముగ్గురు మృత్యువాత నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఘటన
చందంపేట : మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో స్నానం ఆచరించేందుకు కృష్ణా బ్యాక్ వాటర్‌లో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని దేవరచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన కేతావత్ రాము(32), బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి చెందిన వాంకుడావత్ పూర్ణ గోపాలభరత్ (22), అవనిగడ్డకు చెందిన ఉమా సాయికాంత్ (11)లతోపాటు పలు కుటుంబాలు దేవరచర్లలోని తుల్జా భవాని ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సెప్టెంబర్ 30న వచ్చారు. అక్కడే బస చేసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుగుప్రయాణం సందర్భంగా గురువారం దేవరచర్ల గ్రామంలో కృష్ణా బ్యాక్ వాటర్, డిండి ప్రాజెక్టు జలాలు కలిసే చోట వాగులో స్నానం చేసేందుకు ఉమా సాయికాంత్ దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో వాగులో జారిపడి మునిగిపోయాడు. గమనించిన కేతావత్ రాము, పూర్ణ గోపాలభరత్‌లు కాపాడేందుకు వాగులోకి దిగారు. ఈత రాకపోవడం, వాగు లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

పండగ పూట పెను విషాదం

పండగ పూట పెను విషాదం