నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్. సత్యశ్రీ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ పడితే కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని తెలిపారు.
రెవెన్యూ రికార్డులు భద్రపరచాలి: కలెక్టర్ సూచన
నరసరావుపేట: రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు ఆధునిక పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.
కార్యాలయంలో ఉన్న రికార్డుల నిర్వహణ గురించి ఆర్‌డీఓ కె.మధులత, తహసీల్దార్ వేణుగోపాల్‌లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి సబ్‌జైలును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వసతులు, మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా.. లేదా.. అని తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తన వైపు నడిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని, బయటకు వెళ్లాక ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు.
డీఎల్‌డీవో కార్యాలయ పనులు పూర్తి చేయాలి
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డీఎల్‌డీవో కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. గుంటూరు రోడ్‌లోని అయ్యప్పస్వామి దేవాలయం పక్కన గల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌ను సత్తెనపల్లి డీఎల్‌డీవో కార్యాలయానికి ఇటీవల కేటాయించారు. దీంతో గురువారం ఆయన దానిని పరిశీలించారు. కార్యాలయంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 10 లక్షలు కేటాయించాల్సిందిగా సీఈఓకు సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, సత్తెనపల్లి డీఎల్‌డీవో బి.రాజగోపాల్, సత్తెనపల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ డిప్యూటీ ఎంపీడీవో షేక్ రెహమాన్, పంచాయతీరాజ్ ఏఈ కె.రామ్‌మోహన్ సింగ్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

రెవెన్యూ రికార్డులు భద్రపరచాలి