
కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ కరవు
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎస్సీలపై దాడులు, వారి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నబాల శామ్యూల్, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖరరావు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఈనెల 16న ఎస్సీ సెల్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్సీలు అంటే షెడ్యూలు క్యాస్ట్ కాదని, వైఎస్సార్ సీపీకి స్టాండర్డ్ కాస్ట్ అని గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లేసి నిరూపించారని తెలిపారు. పార్టీకి వచ్చిన ఓట్లలో ఎస్సీలవే అధికంగా ఉన్నాయని అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చెప్పారని వారు పేర్కొన్నారు. పార్టీకి కంచుకోటలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తన వారిగా చెప్పుకొని వారికి జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యమైనంత మేలు చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాయకులు ఆయా వర్గాలపై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు వైఎస్సార్ సీపీకి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమ వర్గాలను వైఎస్సార్ సీపీ నుంచి విడదీయలేరని వారు స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని దళితులంతా పార్టీకి వెనుదన్నుగా ఉండాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు చావలి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పులివెల మాణిక్యం, జిల్లా కార్యదర్శులు కాలే మాణిక్యాలరావు, నెలటూరి సురేష్, ఎస్సీ సెల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల ఎజ్రా, అచ్చంపేట, యడ్లపాడు, రొంపిచర్ల మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు శిఖా తిమోతి, వలేటి ఉదయకిరణ్, గుండాల వెంకటేష్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజం
16న నరసరావుపేటలో
విస్తృత స్థాయి సమావేశం