
బెట్టింగ్‌లో నష్టపోయి యువకుడి ఆత్మహత్య
నరసరావుపేట టౌన్: క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబందించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరుకు చెందిన సీతారామ్(25) మెడికల్ హోల్‌సేల్ దూకాణంలో పని చేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయాడు. అధిక వడ్డీలకు తెచ్చి మరీ పందేలు కాశాడు. గత కొన్ని నెలలుగా అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం అర్ధరాత్రి జొన్నలగడ్డ గ్రామ సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వెనుక ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందు విషయాన్ని స్నేహితునికి ఫోన్‌లో చెప్పాడు. అర్ధరాత్రి సీతారామ్ అచూకీ కోసం బందువులు, స్నేహితులు పరిసరాలు అంతా వెతికారు. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. శవ పంచనామా అనంతరం బంధువులకు అప్పగించారు.
సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలి
గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమావేశంలో డీఆర్‌ఎం
లక్ష్మీపురం: గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గుంటూరు డివిజన్ అధికారులు అందుబాటులో ఉంటారని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గూడ్స్, పార్సిల్ వినియోగదారులు బిజినెస్ డెవలప్‌మెంట్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–ఆగస్టు వరకు గత సంవత్సరంతో పోల్చితే సరుకు రవాణా ఆదాయం 26.12 శాతం పెరిగిందని తెలిపారు. రెడ్డిపాలెంలో ప్రత్యేక కంటైనర్ రైలు టెర్మినల్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సరుకు లోడింగ్‌ను పెంచి డివిజన్ లక్ష్యాన్ని సాఽధించేందుకు సహకరించాల్సిందిగా కోరారు. సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు, గూడ్స్ షెడ్ అభివృద్ధి గురించి వివరించారు. కార్యక్రమంలో గూడ్స్ వినియోగదారులు ప్రేమ్, కాశిరెడ్డి, జి.వి. రమణ, హేమంత్‌కుమార్, కె.ఆర్. రెడ్డి, పార్సిల్ వినియోగదారులు రెహ్మన్, అమీర్, ప్రభాకర్, డివిజన్ అధికారులు ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డీఓఎం శ్రీనాథ్, సీనియర్ డీఈఎన్ శ్రీనివాస్, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియర్ డీఎఫ్‌ఎం అమూల్యా బి.రాజ్, డీసీఎం వినయ్‌కాంత్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.