
పేద విద్యార్థులకు వరం
యడ్లపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరులశాఖ ఏటా జాతీయ ఉపకార వేతన పరీక్ష నిర్వ హిస్తోంది. ప్రతిభ ఉన్న వారికి పేదరికం అడ్డుకారాదని చెబుతూ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తోంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 30వ తేదీ కాగా, ఈ ఏడాది డిసెంబర్ 7న పరీక్ష జరగనుంది. దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అర్హులు వీరే...
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, వసతి లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3.5 లక్షల లోపు ఉండాలి. 2024–25 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో బీసీ, ఓసీ విద్యార్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50శాతం మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు ఇలా చేయాలి
ఆసక్తి ఉన్న విద్యార్థులు www. bse. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష రుసుం రూ.100 కాగా, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 చొప్పున ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలో లభించే ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి.
ఉపకార వేతనం
ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతిలో 55శాతం మార్కులు, 10వ తరగతిలో 60శాతం, ఇంటర్ మొదటి సంవత్సరంలో 55శాతం మార్కులు సాధిస్తేనే ఉపకార వేతనం కొనసాగుతుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 12వేల చొప్పున నాలుగు సంవత్సరాలకు విద్యార్థికి ఉపకార వేతనం లభిస్తుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల
ఏటా రూ. 12వేల చొప్పున
ఉపకార వేతనం