
వేధింపులపై ఐసీసీలో ఫిర్యాదు చేయండి
యడ్లపాడు: మహిళలపై జరిగే వేధింపుల నిర్మూలనకు ఐసీసీ(ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు డీవీసీ(గృహహింస కేసుల) సోషల్ కౌన్సిలర్ ఎం.సంగీత తెలిపారు. మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ మిల్లులో సోమవారం మిషన్ సంకల్ప కార్యక్రమంలో భాగంగా బాలలు, మహిళలకు చట్టాలకు సంబంధించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ నాదెండ్ల ప్రాజెక్టు సీడీపీఓ జి.శాంతకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై జరిగే లైంగిక దాడుల నివారణ కోసం ఐసీసీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గృహహింస నిరోధక చట్టంపై మహిళలకు వివరించారు. ఓఎస్‌సీ(ఒన్ స్టాప్ సెంటర్) లీగల్ కౌన్సెలర్ కె.వాణిశ్రీ మాట్లాడుతూ మహిళా సంరక్షణ, ఉచిత న్యాయాన్ని అందించేందుకు 2006లో వచ్చి గృహహింస చట్టంపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో వన్‌స్టాప్ సెంటర్ ద్వారా గృహహింసకు సంబంధించిన కేసుల్లో నేరుగా పోలీస్‌స్టేషన్లకు వెళ్లకుండా ముందస్తుగా ఓఎస్‌సీలో మహిళలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఐదురోజులు వైద్యం, భోజన, వసతి కల్పించి వారికి కుటుంబ సభ్యులను కలిసి బాధిత మహిళకు న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా న్యాయం లభించకుంటే ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కోర్టుద్వారా న్యాయం పొందవచ్చన్నారు. సీడీపీఓ జి.శాంతకుమారి మాట్లాడుతూ బాల్యవివాహాలు, గర్భిణులు – బాలింతలు, పిల్లల ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఆర్.సామ్రాజ్యం, కె.వెంకటరమణ, మహిళా పోలీస్ నిర్మల, వలస కూలీలు, మహిళా కార్మికులు, అంగన్‌వాడీ తల్లులు పాల్గొన్నారు.
డీవీసీ(గృహహింస కేసుల)
సోషల్ కౌన్సెలర్ ఎం.సంగీత