
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేటు భాగస్వామ్యానికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా
నరసరావుపేట: గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను పూర్తిచేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో ధర్నాచేసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఏం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు, కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రయత్నంచేస్తే, కూటమి ప్రభుత్వం వాటిలో పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు భాగస్వామ్యంతో నడపడానికి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మెడిసన్ చదవాలంటే సాధ్యంకానీ పరిస్థితి ఉందని, ఇప్పటికే విద్యా, వైద్యం ప్రైవేటీకరణ వలన పేదలకు అందట్లేదని, ఇక ప్రైవేటుకు అప్పగిస్తే మరింత ఘోరంగా మారుతుందన్నారు. ఇటీవల విజయవాడలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనపై జరిగిన లాఠీచార్జిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కేఎన్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యుడు కంబాల ఏడుకొండలు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోటనాయక్, ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్రహం లింకన్, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు.