
దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
అమరావతి: పవిత్ర శైవక్షేత్రమైన అమరావతి శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో తొమ్మిదిరోజులపాటు చండీహోమం నిర్వహిస్తామని చెప్పారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేయనున్నట్లు తెలిపారు. బాలబాలికలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 29వ తేదీ రాత్రి 8.40 గంటలకు చండీ కల్యాణోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. శమీ వృక్షం కింద ప్రత్యేక వేదికపై అక్టోబరు 2 వ తేదీన రాత్రి స్వామి వారి గ్రామోత్సవం అనంతరం శమీపూజ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానాలలో కూడా దసరా నవరాత్రోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీతా సమేత శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాలు సాయంత్రం అమ్మవారి ప్రత్యేక పూజలు, బతుకమ్మ పూజ నిర్వహించనున్నారు.
అమ్మవారికి అలంకరణలు ఇలా..
తొమ్మిది రోజులపాటు వేడుకల్లో అమరావతి బాల చాముండేశ్వరి దేవి ఆలయంలో 22 వ తేదీన రజత కవచాలంకృత అలంకరణ, 23న బాలా త్రిపుర సుందరీ దేవి, 24న గాయత్రీ దేవి, 25న అన్నపూర్ణా దేవి, 26న మహాలక్ష్మీ దేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి, 28న మంగళగౌరీ దేవి, 29న సరస్వతీ దేవి, 30న దుర్గాదేవి, 01న మహిషాసుర మర్ధిని దేవి, అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకారాలు ఉంటాయని ఈవో తెలిపారు.