
చంద్రబాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. యూరియా బ్లాక్ మార్కెట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9న సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ‘అన్నదాత పోరు’ పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడంపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నదాతల పాలిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. అన్నదాతలను కూటమి ప్రభుత్వం దగాకు గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనీస చలనం లేదని విమర్శించారు. చంద్రబాబు మొద్దు నిద్రవీడాలని, రైతులు ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారన్నారు. యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రైతులకు సొసైటీల్లో యూరియా దొరకకున్నా బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక రేట్లకు ఎరువులు విక్రయిస్తున్నారన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 9న చేపట్టనున్న అన్నదాత పోరులో భాగంగా ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందిస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇంటి ముంగిటకే గతంలో సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత పోరు పేరుతో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని పట్టణం, అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ముందుగా అన్నదాత పోరు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బాసు లింగారెడ్డి, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, రాజవరపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, మర్రి సుబ్బారెడ్డి, సంకటి శ్యాంసన్, తేలుకుట్ల చంద్రమౌళి, చిలుక జైపాల్, మేడం ప్రవీణ్ రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, అచ్యుత శివప్రసాద్, యాసారపు బాబు, సయ్యద్ ఘోర, గుజర్లపూడి సతీష్, పెద్దింటి నాగేశ్వరరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, బండి మల్లిఖార్జునరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు
యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా?
జగనన్న పాలనలోనే అన్నదాతల సంక్షేమం
రేపు నిర్వహించనున్న అన్నదాత పోరులో
భాగస్వాములు కావాలి
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి
సత్తెనపల్లిలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ