
వైఎస్సార్ సీపీపై అక్రమ కేసులు దుర్మార్గం
శావల్యాపురం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వ బలి తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మండలంలోని కారుమంచికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాష్ అక్రమ అరెస్ట్ నేపథ్యంలో తట్టుకోలేక తండ్రి అంకమ్మరావు(వికలాంగుడు) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. అంకమ్మరావు మృతదేహాన్ని బొల్లా సందర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం బొల్లా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈనెల 4వ తేదీ గ్రామంలో టీడీపీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించగా, సత్రం సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోగా ఈ క్రమంలో గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు పాల్పడినట్లు చెప్పారు. దీనితో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా ఇళ్లపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. టీడీపీ దాడులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపించారు. ఆ కేసులో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాశ్‌ను శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసే క్రమంలో అతడి తండ్రి వికలాంగుడైన అంకమ్మరావును అన్ని విధాలుగా పోలీసులు ఇబ్బందులు గురిచేశారన్నారు. దీంతో గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న అంకమ్మరావుకు మళ్లీ గుండెపోటుకు గురి కాగా వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్లు చెప్పారు. మాజీ సొసైటీ చైర్మన్ బొల్లా సాంబశివరావును కూడా అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పగ తీర్చుకోవటం మానుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు(కొండలు), నేతలు వుట్ల సుబ్బారావు, బొల్లా శ్రీనివాసరావు, సుబ్బారావు, రామాంజినేయులు, నాగేశ్వరరావు, కేతినేని ఆంజనేయలు, అప్పలనేని చిన ఆంజనేయులు, తదితరులు ఉన్నారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం ఉన్నారు.
కార్యకర్త అవినాశ్ తండ్రి
అంకమ్మరావుది ప్రభుత్వ హత్యే
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం