
ఆటో కార్మికులను రోడ్డున పడేశారు
అమరావతి: సీ్త్ర శక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందని సీఐటీయూ మండల కార్యదర్శి బి.సూరిబాబు అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మండల ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులనుద్దేశించి సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఉన్నతమైన చదువులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక బ్యాంకులు ద్వారా ఫైనాన్స్‌ల ద్వారా ఆటోలు తీసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. నేడు పిల్లలు ఫీజులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఆటో కార్మికులకు రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు 13 నెలలుగా పూర్తయినా, ఆర్థికసాయం గురించి, ఒక్కమాటైనా మాట్లాడడం లేదన్నారు. మరోపక్క డీజిల్, పెట్రోలు ధరలు పెరిగి, నిత్యవసర వస్తువులు ధరలు కొనుగోలు చేయలేని దుస్థితిలో కార్మికులు బతుకులీడుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు మస్తాన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఎన్నికల్లో వాగ్దానాలన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ డానియేలుకు వినతిపత్రం అందజేశారు. టాటా మ్యాజిక్ యూనియన్ నాయకుడు షేక్ బుడేతో పాటుగా కోటి రవి, కోటి లింగం, నందిగం సుధాకర్, అడపాల కోటేశ్వరరావు అద్దంకి గోపి, షేక్ ఫరీద్ ప్రసాదు, వేదాంతం, సీపీఎం నాయకులు నండూరి వెంకటేశ్వరరాజు ఎస్డీ మొహీ ద్ధీన్ వలి తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో
ఆటో కార్మికుల నిరసన ర్యాలీ