
రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వం
నరసరావుపేట: రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన అన్ని రైతు కూలీ, ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేసే ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి సకాలంలో ఎరువులు సరఫరా చేశామని తెలిపారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ధాన్యానికి బస్తాకు రూ.3 వేలు, మిర్చికి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. సర్కార్ ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయలేదని అన్నారు. ధాన్యం, కందులు, మిర్చి, పత్తికి గిట్టుబాటు ధర లేదని అన్నారు.
అప్రమత్తం చేసినా ఫలితం లేదు
యూరియా రైతులకు అందటం లేదని గతంలో తాము కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒకటి, రెండు కట్టలు అందజేస్తున్నారని అన్నారు. కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులు యూరియా సరిపడా ఉందని చెబుతున్నారని, సరిపడా ఉంటే ఎందుకు నియంత్రణ చేసి ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎకరానికి ఆరు కట్టలు అవసరమని అన్నారు. పల్నాడులో గతేడాది 82,000 హెక్టార్లలో వ్యవసాయం సాగుచేస్తే ఈ ఏడాది దాదాపు 97వేలు నుంచి ఒక లక్ష హెక్టార్లలో సాగుచేశారని, గతేడాది లెక్కల ప్రకారం 36 వేల టన్నులు అవసరమైతే ఇప్పటివరకు 34వేల టన్నులు మాత్రమే ఇచ్చారని, ఇంకా 18 వేల హెక్టార్లకు అదనంగా యూరియా కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు నిజమైన రైతుకి యూరియా అందించకుండా బ్లాక్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. యూరియా బస్తా రూ.266లకు విక్రయించాల్సి వుండగా బ్లాక్‌లో రూ.400 నుంచి రూ.460లకు అమ్ముతున్నారని చెప్పారు. యూరియా అందుబాటులో లేదని దుష్ప్రచారం చేస్తున్నామని మాపై కేసులు పెట్టాలని ఎస్పీ మాట్లాడుతున్నారని, ఈనాడులో యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడుతున్నారని ఒక ఆర్టికల్ రాశారని మరి వారిపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో టీడీపీ నాయకులు సంతకం పెడితేనే రైతుకు యూరియా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ దుకాణాల యజమానులు షరతులు పెడుతున్నారని, తక్షణమే విజిలెన్స్, అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షణ చేసి నియంత్రించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ పాల్గొన్నారు.