
రచ్చబండ పేరుతో ఎమ్మెల్యే హడావుడి
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రచ్చబండ పేరుతో ప్రధాన వీధి చెట్టుకింద కూర్చుని ప్రజలతో ముచ్చటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు అడిగారు. ప్రతి ఇంటికీ రూ. వెయ్యి చొప్పున కలెక్ట్ చేయించండని, దానికి తోడు మరికొంత తాను ఇస్తానని, దాన్ని బాధిత కుటుంబాలకు ఇద్దామని ఎమ్మెల్యే అన్నాడని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క అనారోగాలతో మృత్యువాతకు గురవుతున్న ప్రజలు ఇంటికి వెయ్యి రూపాయలు ఎలా ఇస్తారని మహిళలు, ప్రజలు చర్చించుకుటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా మాట్లాడటంపై కొందరు పెదవి విరుస్తున్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టండి:
ఎమ్మెల్యే బూర్ల
గుంటూరు రూరల్: తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం పర్యటించారు. గత నాలుగు నెలలుగా గ్రామంలో ప్రజలు అకాల అనారోగ్య మృత్యువాతలకు గురవ్వడంతో గురువారం గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యశాఖ, తాగునీటి శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సరిపోకపోతే ఇతర గ్రామాలనుంచి తెచ్చుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.