
10న నాయుడమ్మ అవార్డు ప్రదానం
తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఆయన జన్మదినమైన ఈనెల పదో తేదీన ప్రదానం చేయనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను మంగళవారం సాయంత్రం ఇక్కడి కుమార్ పంప్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు జరిగే సభలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును బహూకరిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీజిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు. అవార్డు ప్రదానోత్సవ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కె.అరవింద్, కె.నందకిశోర్ పాల్గొన్నారు.
చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మంత్రి నాదెండ్ల మనోహర్
అత్తోట(కొల్లిపర):రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డు ల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరకు లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీ మార్ట్‌లుగా తీర్చి దిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు.
యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు
తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

10న నాయుడమ్మ అవార్డు ప్రదానం