
‘పెట్రో’ రవాణాలో నిబంధనలు పాటించాలి
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో చట్టబద్ద నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకు యజమానులు, గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. పెట్రోలియం ఉత్పత్తులు రోడ్డు ద్వారా సురక్షితంగా రవాణా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ సహజ వాయువు సురక్షితమైన రోడ్డు రవాణాకు నియమాలు తప్పని సరిగా పాటించాలని తెలిపారు. పెట్రోలియం సంస్థలు ఎక్కువ దూరాలకు రోడ్డు రవాణాను తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను పరిశీలించాలని సూచించారు. అత్యంత రద్దీ ప్రాంతాలను దాటే సమయంలో ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఎక్కువ దూరం రవాణా చేసే సమయంలో డ్రైవర్‌తో పాటు ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకోవాలన్నారు. డ్రైవర్ల వైద్య ఫిట్‌నెస్ పత్రాలను ప్రయాణం ప్రారంభించే ముందు తటస్థంగా పరీక్షించాలని తెలిపారు. లోడ్ అన్‌లోడ్ సమయంలో ట్రక్ డ్రైవర్లు విశ్రాంతికి సమయం కల్పించేలా సంస్ధలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
– జిల్లాలో 35 బ్లాక్ స్పాట్లును గుర్తించామని, ఆ ప్రదేశాల్లో సురక్షిత చర్యలను అమలు చేయాలని తెలిపారు. పెట్రోల్‌బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్దాల విషయంపై అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బీపీసీ, ఐఓసీఎల్, లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, పెట్రోల్ బంకుల డీలర్లు హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, ట్రాఫిక్ సీఐ సీహెచ్ లోకనాథ, ఏఎంవీఐ ఎంఎల్ వంశీకృష్ణ, బీపీసీ జిల్లా సేల్స్ ఆఫీసర్ చంద్రకాంత్‌నాయక్, ఐఓసీఎల్ జిల్లా సేల్స్ ఆఫీసర్ సాయి ప్రకాష్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.