
ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి
నరసరావుపేట రూరల్: ఆర్‌టీఐ అర్జీలకు సకాలంలో సమాచారం అందించే బాధ్యత అధికారులతో పాటు సిబ్బందిపై ఉందని జిల్లా ఉద్యాన అధికారి ఎ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఉద్యాన కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఆర్‌టీఐ ద్వారా ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఈ చట్టం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా పాలనలో పారదర్శకతకు అవకాశం ఉంటుందని వివరించారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట బి.వెంకటేశ్వరరావు, ఉద్యాన అధికారులు, కార్యాలయ సిబ్బంది, గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం
నరసరావుపేట రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈనెల 23వ తేదీ బుధవారం లోపు రైతుసేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుని వద్ద గ్రీవెన్స్ పెట్టవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ పంట సాగు చేసే కౌలు రైతులు కౌలు కార్డులు పొందాలని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో వరి పంటకు ఎకరానికి రూ.80లు ప్రీమియం చెల్లించి ఆగస్టు 15వ తేదీ కల్లా ఇన్స్యూరెన్స్ చేసుకోవాలని సూచించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతురావు, ఏఓ ఐ.శాంతి, ఏఈవో బ్రహ్మయ్య, వీఏఏ సామంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని ఉద్యోగి మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న జాన్‌బాబు(50) మంగళవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జాన్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన దినేష్ (20) మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తన స్నేహితుడు గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరాడు. చౌడవరం వద్ద హైవేపై డివైండర్ రైలింగ్‌కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. దినేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో 1325.2 మిల్లీమీటర్ల వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 1325.2 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. అత్యధికంగా దాచేపల్లిలో 88.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా వినుకొండలో 14.0 కురిసిందన్నారు. మొత్తం 28 మండలాల్లో వర్షం నమోదైందన్నారు.

ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి

ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి

ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి