
ప్రజలను మోసం చేయటమే టీడీపీ అజెండా
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలచేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా సాకులు చెప్పే టీడీపీ నాయకుల లాంటి వారిని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని నరసరావుపేట వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం డాక్టర్ గోపిరెడ్డి స్పందించి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాలకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డీబీటీ ద్వారా ఐదేళ్లలో రూ.2.72లక్షల కోట్లు అందజేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. తనకు 40ఏళ్ల ఇండస్ట్రీ అని, నాలుగోసారి సీఎం అంటూ చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండానే అంతకంటే ఎక్కువగా ఏ విధంగా గత ఎన్నికల సందర్భంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500లు ఆడబిడ్డ నిధి ఇస్తానని హామీ ఇచ్చాడని ప్రశ్నించారు. ప్రజలకు హామీ ఇచ్చేసమయంలో అవగాహనతో ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేసేందుకు కఠినమైన నియంత్రణ ఉండాలన్నారు. టీడీపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రజలను మోసం చేయటమే వారి అజెండానని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి