
శాస్త్రవేత్తలుగా జెడ్పీ పాఠశాల విద్యార్థులు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతుల విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయి వన్డే యాజ్ ఏ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్‌ఎం లింగిశెట్టి సాంబయ్య మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన బి.అనుశ్రీ,, షేక్ ఖాసీం, షేక్ మస్తాన్‌వలి, కె.ప్రశాంత్, షేక్ అన్వర్‌లను ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక చేశారని చెప్పారు. జిగ్యాసా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ (భవనేశ్వర్)లో ఈ నెల 24న విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.నాగరాజులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.రామాంజనేయులు, రాజులు పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో టైలర్ షాపు దగ్ధం
మేదరమెట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలోగల టైలర్ దుకాణం సోమవారం అర్ధరాత్రి మంటల్లో కాలిపోయింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి దుకాణం తలుపులు వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఫోన్ చేసి షాపులో మంటలు వస్తున్నాయని చెప్పటంతో అక్కడకు వచ్చే సరికి దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో ఉన్న బట్టలు, సామాగ్రి దగ్ధమయ్యాయని.. వాటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని వాపోయాడు.
లారీని ఢీ కొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
మేదరమెట్ల: ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన టాటాఏస్ ఆటో ఢీ కొన్న సంఘటన జాతీయ రహదారిలోని పి.గుడిపాడు గాజు ఫ్యాక్టరీ వద్ద మంగళవారం జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కొరియర్ లారీ పి.గుడిపాడు జాతీయరహదారి గాజు ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉంది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ఆటో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన ఆటో ఆగిఉన్న లారీని ఢీ కొంది. దీంతో లారీలోని డ్రైవర్‌కు.. ఆటో డ్రైవర్‌కు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.