
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
క్రోసూరు: కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచిపోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్‌జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మీడియాతో మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్‌జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని, దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టాడని తెలిపాడు. గతంలో కూడా సాగు నీరు విషయమై వీరు తనపై దౌర్జన్యం చేసారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేసారు. ఆందోళన చేస్తున్న వారితో సీఐ సురేష్, ఎస్‌ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు.