వాహనాలు సీజ్ చేస్తామనడం తగదు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
పిడుగురాళ్ల: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వాహనాలు పంపితే, వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించడం తగదని, ఇది కొత్త సంప్రదాయానికి దారి తీస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిడుగురాళ్లలో ఆయన మాట్లాడుతూ రాజుపాలెం మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావును పోలీసులు అక్రమ కేసులు బనాయించి, బాగా హింసించి, దూషించి ఆత్మహత్యకు పురిగొల్పారన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా.. వైఎస్ జగన్ పర్యటన ఆగదన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు, యువకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో నలుగురు
ఎస్‌ఐలకు స్థాన చలనం
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో నలుగురు ఎస్‌ఐలను వివిధ స్టేషన్‌లకు తాత్కాలికంగా ఎటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీసీబీలో పనిచేస్తున్న టి.తిరుపతిరావును మాచవరం పీఎస్‌కు, మాచవరం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎం.రోశయ్యను సీసీఎస్‌కు, నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో పనిచేసే డి.అశోక్‌ను నాగార్జునసాగర్ పోలీసుస్టేషన్‌కు గురజాల పోలీసుస్టేషన్‌లో పనిచేసే వై.వినోద్‌కుమార్‌ను మాచర్ల రూరల్ పోలీసుస్టేషన్‌కు ఎటాచ్ చేశారు.
వీఆర్‌కు మాచర్ల రూరల్ ఎస్‌ఐ నరసింహులు
మాచర్ల రూరల్: మాచర్ల రూరల్ ఎస్‌ఐ వి.నరసింహులును వీఆర్‌కు బదిలీ చేశారు. 45 రోజుల క్రితం మాచర్ల రూరల్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే రేంజ్ వీఆర్‌కు బదిలీ కావడం విశేషం. నరసింహులు ఇటీవల యాక్సిడెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చే విషయంలో మాజీ మంత్రి, కుటుంబ సభ్యులను లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు నరసింహులును వీఆర్‌కు బదిలీ చేశారు. ఏఎస్‌ఐగా పనిచేస్తున్న షేక్ రఫీకి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
బైక్‌పై విన్యాసాలు చేసిన
వ్యక్తిపై కేసు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన మోహన్‌ప్రసాద్, ఉయ్యాల సురేష్ స్నేహితులు. మోహన్‌ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని బైక్‌ను కొన్ని రోజుల క్రితం సురేష్ తీసుకెళ్లి వెనుక మరో యువకుడిని ఎక్కించుకుని అర్ధరాత్రి కృష్ణలంక జాతీయ రహదారిపై విన్యాసాలు చేశాడు. వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. వాటిని ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఆ విన్యాసాలను ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ నెల 15న మోహన్‌ప్రసాద్ చూశాడు. తన బైక్‌తోనే విన్యాసాలు చేశాడని గుర్తించాడు. గంటలో తీసుకొస్తానని చెప్పి తన బైక్‌ను తీసుకెళ్లి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్‌ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
వాహనాలు సీజ్ చేస్తామనడం తగదు


