యోగాతో శారీరక రుగ్మతలు దూరం
ఆర్డీఓ కె.మధులత
నరసరావుపేట: యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని, తద్వారా యోగా ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడమే దాని ముఖ్యోద్దేశమని ఆర్డీఓ కె.మధులత అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పల్నాడు బస్టాండ్ పెద్ద చెరువురోడ్డు వద్ద ఆదివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో 200 మంది వయో వృద్ధులు పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని, ఇక్కడి నుంచి వెళ్లాక ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా సాధన చేయటం ద్వారా శారీరక రుగ్మతల నుంచి దూరం కావటంతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. బీపి, మధుమేహం, ఒళ్లు నొప్పులు వంటి శారీర రుగ్మతలకు దూరం కావడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం.యశ్వంత్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. పెన్షనర్ల అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ కార్యక్రమంలో తాము పాలుపంచుకోవటం ఆనందంగా ఉందన్నారు.
దుర్గమ్మ నిత్యానదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హైదరాబాద్‌వాసి వి.బాలాజి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
బాలాత్రిపురసుందరికి
బంగారు ఆభరణాలు
కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్–కూచిపూడి) నాట్యాచార్యుల ఇలవేల్పైన శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, శ్రీ దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు.
శివాలయం ఉద్యోగి సస్పెన్షన్
పెదకాకాని: శివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కొన్ని సంవత్సరాలుగా ఇల్లా ప్రదీప్‌కుమార్ ఎన్‌ఎంఆర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆలయ అధికారికి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ప్రదీప్ కుమార్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం అతడ్ని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు.
యోగాతో శారీరక రుగ్మతలు దూరం
యోగాతో శారీరక రుగ్మతలు దూరం


