అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ● పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 158 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 158 అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన వారిలో డీఆర్‌ఓ ఏకా మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వేధిస్తున్నా పట్టించుకోవట్లేదు
నేను కొన్నేళ్లుగా శ్రీనివాసనగర్–2 అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు. ఇదే నాకు జీవనాధారం. అదే సెంటర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ నన్ను ఆకారణంగా వేధిస్తుంది. పిల్లలను తీసుకురావొద్దని, తీసుకొస్తే రేషన్ మిగలదని అంటూ నాపై దాడిచేస్తుంది. ఈరోజు సోమవారం కూడా దాడిచేసింది. గతంలో నాపై దాడి చేసినందుకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమైపె చర్యలు తీసుకోవాలని మరోసారి అర్జీ అందజేస్తున్నా. సీడీపీఓ ఉమామహేశ్వరి ఆమెను పిలిపించి మాట్లాడతానని చెప్పింది.
–సింధు నాగూభాయ్, అంగన్‌వాడీ ఆయా, నరసరావుపేట
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి


