రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు

May 15 2025 2:15 AM | Updated on May 15 2025 2:44 PM

-

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు

చిన్న పొరపాటు జరిగినా మళ్లీ తీసుకోవాల్సిందే 

రెండోసారి రూ.200.. మూడోసారి రూ.500 వడ్డన 

ప్రస్తుతం రోజుకు 39 రిజిస్ట్రేషన్లకే అవకాశం 

మధ్యాహ్నం నుంచే ఎక్కువ స్లాట్లు

అమరావతి: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టైం స్లాట్‌ విధానంతో క్రయవిక్రయదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. స్లాట్‌ తీసుకున్నాక ఎన్ని పనులున్నా ఆ టైంకు వెళ్లాల్సిందే. కొంచెం ఆలస్యమైనా.. చిన్న పొరపాటు జరిగినా... అది రద్దు అవుతోంది. మరోమారు స్లాట్‌ తీసుకోక తప్పడం లేదు. అందుకోసం మరో రూ. 200 సమర్పించుకోవాలి. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్‌ చేసేవారు. నూతన విధానంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు 39 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే చేయొచ్చు. తాము అనుకున్న సమయం కాకుండా స్లాట్‌ దొరికినప్పుడే వ్యయప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు చేరుకోవాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్‌ పనిమీద వచ్చిన వారు ఆ రోజు స్లాట్‌ దొరక్కపోతే మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పల్నాడు జిల్లాలో అమరావతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రాజధాని అమరావతికి సమీపంలో ఉండటంతో రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ కార్యాలయం పరిధిలో మండలంలోని అమరావతి, ధరణికోట, దుడుగు, మల్లాది, లింగాపురం, నరుకుళ్ళపాడు, ఎండ్రాయి, కర్లపూడి, ఉంగుటూరు, పెదమద్దూరు, వైకుంఠ పురం, పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు, తాడికొండ మండలంలోని మోతడక, పాములపాడు గ్రామాలున్నాయి. ఇవన్నీ రైతులు ఎక్కువగా ఉన్న గ్రామాలు కావటంతో ఉదయం పూట వ్యవసాయం, లేక పాడి పనులు చూసుకుని రిజిస్ట్రేషన్‌ల కోసం మధ్యాహ్నం భోజనం చేసుకుని తీరుబడిగా వస్తుంటారు. ఎంత సమయమైనా వేచి ఉండి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వేళ్లేవారు. 

ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన టైమ్‌ స్లాట్‌ విధానంతో ఉదయం పూట టైమ్‌ స్లాట్‌లు పెద్దగా బుక్‌ కావటం లేదు. మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్‌లు ఎక్కువ ఉండటంతో స్లాట్‌ దొరకడం లేదు. కొంతమంది రిజిస్ట్రేషన్‌లను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రోజులో కేటాయించిన 39 రిజిస్ట్రేషన్‌లు పూర్తయి.. ఇంకా మిగిలి ఉన్న వారికి సాయంత్రం 5గంటల తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌లు చేయవచ్చు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్లు అలా చేయటం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి టైమ్‌ స్లాట్‌ కొంత ఇబ్బందిగా మారింది. ఒక రోజు రిజిస్ట్రేషన్‌ కాకపోతే మరుసటి రోజు ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆన్లైన్‌ సైట్‌ పనిచేయకపోతే పడిగాపులు తప్పడం లేదు.

గతంలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్‌

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో టైం స్లాట్‌ విధానం 2020 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండేది. గత ప్రభుత్వ హయాంలో క్రయ విక్రయదారులే తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేలా పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతనంగా టైం స్లాట్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం మార్చి తీసుకొచ్చారు.

రెండోసారి బుక్‌ చేసుకుంటే రూ.200

రిజిస్ట్రేషన్‌ కోసం ఒకసారి టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా, లేక డాక్యుమెంట్‌లో ఏదైనా పొరపాట్లు జరిగినా స్లాట్‌ టైం ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాటు బుక్‌ చేసుకోవాలంటే అదనంగా రూ.200 కట్టాలి. ఇక మూడో సారి అయితే రూ. 500 చెల్లించాలి. ఫలితంగా క్రయ విక్రయదారులపై మరింత ఆర్థికభారం పడుతోంది.

స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం

స్లాట్‌ విధానం వచ్చిన తర్వాత ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒకటో రెండో స్లాట్‌లు బుక్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం నుండి స్లాట్‌లు అధికంగా బుక్‌ చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజుకు మాకు ఇచ్చిన 39 స్లాట్‌లు పూర్తయితేనే 5 గంటల తర్వాత స్లాట్‌ బుకింగ్‌ లేని వాళ్లకు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నాం.

– పి.వెంకటరెడ్డి, సబ్‌రిజిస్ట్రార్‌, అమరావతి

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు1
1/2

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు2
2/2

రిజిస్ట్రేషన్‌ శాఖలో స్లాట్‌ విధానంతో తిప్ప‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement