
కమ్మ జన సేవా సమితిలో విద్యార్థినులకు ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఆశ్రయం పొందడానికి కమ్మ జన సేవా సమితిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. కుందుల రోడ్డులోని కమ్మ జన సేవా సమితిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రగతి పత్రాల్ని ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీతో పాటు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈనెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నామమాత్రంగా వసూలు చేస్తున్న ఫీజు నుంచి ప్రతి విద్యార్థినికి రూ.వెయ్యి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభ, పేదరికం, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల నడవడిక, వసతిగృహంలో క్రమశిక్షణతో మెలిగే విధానాన్ని గమనించి, పాలకవర్గం కమిటీ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు వార్షికోత్సవం రోజున ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.40 లక్షల ఉపకార వేతనాలు అందజేస్తామని వివరించారు. సంస్థ కార్యదర్శి చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దాదాపు 300 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికీ రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థినులకు దాతల సహకారంతో ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జేకేసీ కళాశాల రోడ్డులో రూ.50 కోట్ల వ్యయంతో రెండు వేల మంది విద్యార్థినులకు వసతి కల్పించే సామర్ధ్యంతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. సంస్థ కార్యాలయంతో పాటు కమ్మ జన సేవాసమితి.కామ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను ఈనెల 29లోపు సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 0863–2355471, 2260666 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.