
పొట్టకూటి కోసం వచ్చి అనంత లోకాలకు..
సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇరువురు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
కారు ఢీకొని కూలీ మృతి.. మరొక వ్యక్తికి తీవ్రగాయాలు