
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
గుంటూరు మెడికల్: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంపై విజయవాడ నగర సెంట్రల్ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ప్రవేశించి సెర్చ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు షేక్ నాగూల్‌మీరా మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవే దాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభం అయిన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిషన్ ఇన్‌చార్జి ఎం.తిరుమలరెడ్డి, యూనియన్ జిల్లా సెక్రటరీ కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు సత్య నారాయణశర్మ, అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్, సబ్ ఎడిటర్లు దివి రఘు, పి.శ్రీనివాసరావు, ఎన్.వెంకట్, బి.సురేష్‌బాబు, జర్నలిస్టులు మొండితోక శ్రీనివాసరావు, షరీఫ్, వీరయ్య, సురేంద్ర, పి.ప్రశాంత్, డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, రామ్‌గోపాలరెడ్డి పాల్గొన్నారు.
దాడులు హేయమైన చర్య
‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్. ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసిన తీరును ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూల్‌మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు సోదాలు చేయాలని భావించి ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలని సూచించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలో చొరబడిన తీరును ఖండించారు. ఇలాంటి ధోరణి భావ్యం కాదని తెలిపారు.