
నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలని వినతి
పర్చూరు(చినగంజాం): ప్రభుత్వమే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలని పర్చూరు నియోజక వర్గ పరిధిలోని పలువురు రైతులు అధికారులను కోరారు. పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం ఉప్పుటూరు గ్రామంలో పలు విషయాలను ఉన్నతాధికారులకు వివరించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు, రైతు నాయకులు మాట్లాడారు. వ్యాపారులు కొనుగోలు చేయటానికి ముందుకు రావటం లేదని, విదేశాల్లో ఉన్న ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో పొగాకు ఎగుమతులకు ఆదరణ లేనందున ఈ పరిస్థితి నెలకొందని రైతులు వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవ సాయ సహకారం) బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారులతో బుధవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా వారిని ఒప్పిస్తామని తెలియజేశారు.