ఆగని రేషన్‌ బియ్యం దందా | - | Sakshi
Sakshi News home page

ఆగని రేషన్‌ బియ్యం దందా

May 5 2025 8:38 AM | Updated on May 5 2025 10:34 AM

ఆగని

ఆగని రేషన్‌ బియ్యం దందా

రేషన్‌ బియ్యంతో ఉన్న లారీని గ్రామస్తులు పట్టుకున్నా అక్రమ రవాణా కట్టడి కాని ఉదంతమిది. మండలంలో పేటసన్నెగండ్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్‌ బియ్యం లారీని గ్రామ యువకులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అధికారులకు సమాచారం అందించడానికి యత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వాహనం సహా డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

కారెంపూడి: రేషన్‌ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్ఛగా బియ్యం తరలిస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పేటసన్నెగండ్ల గ్రామంలో చాలా సేపు లారీని అక్కడి నుంచి పోకుండా అడ్డుకున్నారు. డ్రైవర్‌ లారీని వారిపై నుంచి పోనిచ్చే యత్నం చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు లారీ అద్దాలు పగులగొట్టి రేషన్‌ బియ్యానికి నిప్పు పెట్టారు. రేషన్‌ బస్తాలు కింద పడేశారు. అయినా ఫలితం లేదు. కిందపడేసిన రేషన్‌ బియ్యాన్ని లారీలో వేసుకుని డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు ఎంత రిస్క్‌ తీసుకున్నా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేని అచేతన స్థితిలో అంతా ఉండిపోయారు. ఆగని ఈ అక్రమం వ్యవస్థలు పతనం అవుతున్న తీరుకు అద్దం పడుతోంది.

నాయకుల అండతోనే...

ఈ బియ్యం మండలానికి చెందినవి కావని, ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని గ్రామాలవారీగా నాయకులు పంచుకున్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యమే. గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించి ప్రధాన వ్యాపారులు ఆ బియ్యాన్ని సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.

బియ్యం ఇవ్వకుండానే...

కార్డుదారులకు బియ్యానికి బదులు కిలోకు రూ.10 వంతున ఇచ్చి బియ్యాన్ని సేకరిస్తున్నారని తెలుస్తోంది. కార్డుదారులు బియ్యం కోసం ఎదురు చూస్తుంటే వారి ఇళ్లకు రేషన్‌ బండ్లు వెళ్లకపోవడంతో ఎటూ బియ్యం ఇవ్వరేమోననే భయంతో, రేషన్‌ తీసుకోకపోతే కార్డు రద్దు అవుతుందనే భయంతో డీలర్ల వద్దకు వెళ్లి వేలిముద్ర వేసి వారిచ్చిన డబ్బు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పేట సన్నెగండ్ల రేషన్‌ బియ్యం ఉందంతం వెలుగుచూసింది. బియ్యం పంపిణీ ప్రారంభమైన రెండో రోజే ఇలా లారీ బియ్యం తరలిపోతుండడం చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు తహసీల్దార్‌ నివేదిక

ఈ ఘటనపై తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు నాయక్‌ కలెక్టర్‌కు నివేదించారు. పేటసన్నెగండ్ల గ్రామంలో గత శుక్రవారం రాత్రి ఏపీ39యూఎన్‌7527 నంబరు లారీలో రేషన్‌ బియ్యంతో గ్రామంలోకి వస్తుండగా కొంతమంది యువకులు అడ్డుకున్నారని తెలిపారు.

లారీ డ్రైవర్‌ వాహనాన్ని వారి మీదుగా తీసుకెళ్లడానికి యత్నించగా గమనించిన గ్రామస్తులు లారీపై దాడి చేయగా లారీ అద్దాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. బియ్యానికి నిప్పు పెట్టి రెండు బస్తాలు కిందపడేయం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్‌ ఆ బస్తాలను లారీలో వేసుకుని అక్కడి నుంచి లారీతో పరారయ్యాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు వీఆర్వో ఫిర్యాదు చేశారని తెలిపారు.

బియ్యం తరలిస్తున్న లారీని అడ్డుకున్న గ్రామస్తులు యంత్రాంగం నిర్లక్ష్యంతో యథేచ్ఛగా అక్రమ రవాణా

ఆగని రేషన్‌ బియ్యం దందా 1
1/1

ఆగని రేషన్‌ బియ్యం దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement