
రణక్షేత్రంలో వీరాచారుల సందడి
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో ఆదివారం వీరాచారులు సందడి చేశారు. వదిలి పెట్టిన వీరాచారాన్ని మళ్లీ పునఃప్రతిష్ట చేసుకునే క్రతువులు రణక్షేత్రంలో జరిగాయి. వీరాచారులతో పాటు వారి బంధువులు వందలాదిగా తరలివచ్చి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరుల గుడి నాగులేరు ఒడ్డున వీరుల ఆయుధాలకు పూజ కట్టుకుని అక్కడ నుంచి చెన్నకేశవస్వామి, అంకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీరాచారులు భారీగా తరలిరావడంతో రణక్షేత్రంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. వీరుల గుడి ఆవరణ భక్తులతో నిండిపోయింది. వీరాచారుల ఊరేగింపులో బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం పాల్గొనడం విశేషం. పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వీరుల గుడి పూజారులు వివిధ రకాల క్రతువులు నిర్వహించారు. కారెంపూడికి చెందిన కిల్లా స్వాములు కుమారులు, మనువళ్లు వదలిపెట్టిన వీరాచారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో విశ్రాంత డీటీ యడ్ల రామకృష్ణారావు, చెన్నకేశవస్వామి ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కిల్లా చినకోటేశ్వరరావు, కిల్లా వంశస్తులు పాల్గొన్నారు.

రణక్షేత్రంలో వీరాచారుల సందడి