నరసరావుపేట టౌన్: జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో దొంగతనం కేసులు నమోదువుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం నరసరావుపేటలో గడచిన వారంలో మూడు దొంగతనాలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దోచుకెళ్తున్నారు. ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలూ మాయమవుతున్నాయి. గత వారం రోజుల కిందట రామిరెడ్డిపేటకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు ఎం.సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. రెండవ రోజు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగు సమాచారాన్ని అందజేశారు. ఇంటికి వచ్చి పరిశీలించగా బీరువాలో ఉండాల్సిన నగదు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల కిందట ప్రకాష్‌నగర్ టౌన్‌హాల్ వెనుక అద్దె భవనంలో నిర్వహిస్తున్న జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయ తాళాలను దుండగులు పగలగొట్టారు. అక్కడ విలువైన వస్తువులు లేకపోవటంతో పక్కనే ఉన్న ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. జిల్లా ఉద్యాన అధికారి చందలూరి వెంకట రమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రిళ్లు గస్తీ ఏదీ ?
జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వరుసగా జరుగుతున్న చోరీలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు రావటంతో పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉక్కపోతకు ఆరుబయట నిద్రించేవారు ఉంటారు. ఇదే అవకాశంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పోలీస్ అధికారులు స్పందించి రాత్రిళ్లు గస్తీ పెంచి చోరీల నియంత్రణలకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
సవాల్‌గా మారిన దొంగతనాలు..
ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల్ని లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు చోరీ సంఘటనలు రెండు జరిగాయి. సుమారు రూ.40 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. మరో వైపు గృహాలను దోచుకోవటం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దొంగతనాలను ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నరసరావుపేటలో వరుస చోరీలు
తాళం వేసిన గృహాలే లక్ష్యంగా
దొంగతనాలు
వీఆర్వో ఇంట్లో 10 సవర్ల బంగారం, నగదు మాయం
వారం రోజుల్లో మూడు ఇళ్లు
దోచిన దొంగలు
ఎల్‌హెచ్ ఎంఎస్ సౌకర్యాన్ని
వినియోగించుకోవాలని
సూచిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు
పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చేలోపు ..
ఎల్‌హెచ్ ఎంఎస్ సౌకర్యాన్ని
ఉపయోగించుకోండి
నరసరావుపేట పట్టణానికి చెందిన శ్రీనివాసరావు వేసవి సెలవులకు కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది. బీరువాలోని బంగారంతో పాటు నగదు మాయమైంది.
నరసరావుపేట రూరల్ మండలం ములకలూరు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మ పిల్లలతో పుణ్యక్షేత్రానికి వెళ్లింది. తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెకు ఫోన్ చేశారు. వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రతి ఒక్కరూ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఉంటే సమాచారాన్ని సిస్టమ్‌లో పొందుపరచాలి. టెక్నాలజీ సహాయంతో ఆయా గృహాలకు సాంకేతిక నిఘా ఏర్పాటు చేస్తాం. రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తెలియపరచండి. వారు ఇచ్చిన సమాచారంతో ఆ గృహాలను సిబ్బంది పర్యవేక్షిస్తారు.
– కె.నాగేశ్వరరావు,
నరసరావుపేట డీఎస్పీ
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామ వీఆర్వో వెల్లల చెరువు వెంకట శివరామకృష్ణ ప్రకాష్‌నగర్‌లో ఉంటున్నాడు. శుక్రవారం ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవ దర్శనానికి మోపిదేవి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు తెలియజేశారు. శనివారం వచ్చి పరిశీలించగా బీరువాలో ఉండాల్సిన సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌చరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీం అక్కడకు చేరుకొని ప్రాథమిక ఆధారాలను సేకరించారు.