అంగన్‌ వేడి కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌ వేడి కేంద్రాలు

May 4 2025 6:53 AM | Updated on May 5 2025 10:28 AM

అంగన్

అంగన్‌ వేడి కేంద్రాలు

ముప్పాళ్ళ: వేసవి సెలవుల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది. చిన్నారులు ఎండల్లో సైతం కేంద్రాలకు రావాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా వేసవి వచ్చిందంటే అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయటం పరిపాటి. మే నెలలో అంగన్‌వాడీ టీచర్లకు 15 రోజులు, మరో 15రోజులు ఆయాలకు సెలవులు మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం మే 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం సెలవులు ప్రకటించకుండా కక్షపూరితంగా వ్యహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంగన్‌వాడీలపై కక్షతోనే..!

ఇప్పటికే రకరకాల యాప్‌లతో అంగన్‌వాడీ టీచర్లను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తాజాగా ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి పెట్టుకోవాలని, టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల వరకూ అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం జీతాలు పెంపుతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలపై అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం మాట లెక్కచేయకుండా చలో విజయవాడ పేరుతో వేలాది మందితో భారీ ధర్నాను చేపట్టారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం జీతాలు పెంచకపోవడమే కాకుండా వేసవి సెలవులు ఇవ్వకుండా అంగన్‌వాడీలపై కక్ష తీర్చుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కిశోర వికాసం పేరుతో...

వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం కిశోర బాలవికాసం పేరుతో వారానికి రెండురోజులు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం మంచిదే అయినా, వేసవిలో సెలవులు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీలు కన్వీనర్లుగా వారి సెంటర్ల పరిధిలోని కిశోర బాలికలను సర్వే చేసి, వారితో సచివాలయ పరిధిల్లోని ఏఎన్‌ఎంలు, ఎంఎస్‌కేలతో కలిపి ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రాపౌట్‌, బాల్య వివాహాలపై నష్టాలు, వారికి పుట్టే బిడ్డల అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఎండలు తీవ్ర ప్రభావం చూపే మే నెల మొత్తం సమావేశాలు నిర్వహించేలా జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సత్తెనపల్లి ప్రాజెక్ట్‌ పరిధిలో...

ఐసీడీఎస్‌ సత్తెనపల్లి ప్రాజెక్ట్‌ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, నకరికల్లు, రాజుపాలెం మండలాల పరిధిలో 300 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సున్నా నుంచి ఏడాది లోపు 1,598 మంది చిన్నారులు, సంవత్సరం నుంచి ఐదేళ్ల లోపు 6,904 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 4,094 మంది పిల్లలున్నారు. వీరితో పాటుగా 11 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల లోపు 5,511మంది, 18 సంవత్సరాలలోపు 4,606 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరితో పాటుగా 1,411 మంది గర్భిణులు, 1,469 మంది బాలింతలు ఉన్నారు.

పలుదేవర్లపాడులో కిశోర వికాసం ర్యాలీ చేస్తున్న కిశోర బాలికలు, అంగన్‌వాడీ సిబ్బంది

ఉక్కపోతతో అల్లాడుతున్న పిల్లలు సెలవుల ఊసే ఎత్తని ప్రభుత్వం కిశోర వికాసం పేరుతో సమావేశాలు

ఉక్కపోతతో ఇక్కట్లు

ఉదయం 7గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుండటంతో వారిని సముదాయించలేక ఆయాలు నానా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించకుండా ఇంటివద్దే ఉంచుకుంటున్నారు. ఫలితంగా హాజరుశాతం సగానికి పైగా తగ్గిపోతోంది. వీరితో పాటుగా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం ఎండలోనే తప్పనిసరిగా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది.

అంగన్‌ వేడి కేంద్రాలు1
1/1

అంగన్‌ వేడి కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement