
నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్‌ఈఈటీ) పరీక్ష జరగనున్న సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు అదికారులను ఆదేశించారు. పరీక్షల నేపధ్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పరీక్షలు జరుగుతున్న కాకాని జేఎన్‌టీయూ–కె, ఇర్లపాలెం పీఎం కేంద్రీయ విద్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నీట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు మూసేయాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయం లోపు, పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలన్నారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లను కేంద్రాల్లోకి అనుమతించ వద్దన్నారు. అవసరమైతే పరీక్ష కేంద్రాల చుట్టుప్రక్కల డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని సూచించారు.