
వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులుగా గౌతంరెడ్డి
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా విజయవాడకు చెందిన పూనూరి గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
7న కౌన్సిల్ సమావేశం
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మే 7వ తేదీన జరగనుంది. ఈనెల 25వ తేదీన జరగాల్సిన కౌన్సిల్ సమావేశం మేయర్ ఎన్నిక కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదా పడిన సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్ కాపీలను సభ్యులకు మంగళవారం అందజేశారు.
దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని వీరవట్నం సమీపంలో గల దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవ తిరునాళ్ల మంగళవారం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలవారు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి పొంగళ్లు నిర్వహించి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. స్వామికి ఇష్టమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
నేడు దుర్గమ్మ సన్నిధిలో శ్రీమహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఉదయం 9 గంటలకు యాగం నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. యాగాన్ని దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
వీర్ల అంకమ్మతల్లికి బోనాలు
దాచేపల్లి: వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా మంగళవారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహిళలు దేవాలయానికి బోనాలతో వచ్చారు. నెత్తిపై బోనాలు పెట్టుకుని మేళతాళాలతో గ్రామ పురవీధుల్లో నుంచి దేవాలయానికి చేరుకుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రత్యేకంగా పూజలు చేసిన తరువాత అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యుడు యలమల నరేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
గాయత్రీదేవి శక్తి స్థూపం ఆవిష్కరణ
కర్లపాలెం: గాయత్రీదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దమ్మనవారిపాలెం గ్రామంలో పి.వెంకట ప్రసూనాంబ, సునందనరావు దంపతుల ఆధ్వర్యంలో గాయత్రీదేవి స్థూపం ఆవిష్కరించారు. ముందుగా స్థూపం వద్ద శాంతిహోమాలు నిర్వహించారు. అనంతరం గాయత్రీ మహామంత్రం జపించి గాయత్రీదేవికి పూజలు చేశారు. ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు మొదలగు పంచభూతాల సమూహమే గాయత్రీదేవి అని చెప్పారు. విశ్వశాంతి కోసం గాయత్రీదేవిని పూజించాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, మాజీ ఎంపీపీ తాతా లీలావరప్రసాద్, మాజీ సర్పంచ్ అలపర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులుగా గౌతంరెడ్డి

వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులుగా గౌతంరెడ్డి