
క్రికెట్ పోటీల్లో సత్తెనపల్లి పోలీసుల సత్తా
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శరభయ్య గుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో న్యాయవాదులకు, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులకు(సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు) ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జరిగాయి. సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ్‌కుమార్‌రెడ్డి టాస్ వేయగా టాస్ గెలిచిన న్యాయవాదులు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ పోటీల్లో పోలీసు జట్టు 16 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు 69 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 50 పరుగులు తేడాతో సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీసులు గెలుపొందారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను వేలిముద్రల విభాగం ఇన్‌స్పెక్టర్ రహీమ్ కై వసం చేసుకున్నారు. పోలీసుల జట్టుకు పట్టణ సీఐ బి.బ్రహ్మయ్య కెప్టెన్‌గా వ్యవహరించగా న్యాయవాదుల జట్టుకు న్యాయవాది పొత్తూరి హరి మణికంఠ కెప్టెన్‌గా వ్యవహరించారు. విజేతలకు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ్ కుమార్ రెడ్డి కప్పు అందించి అభినందించారు. ఆయనతోపాటు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ మహమ్మద్ గౌస్ ఉన్నారు. క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటిన సబ్ డివిజన్ పోలీస్ జట్టును సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. కాగా తొలుత పోటీలను సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం రెండు జట్లను పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభింపజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎం.సంధ్యారాణి, పవన్ కుమార్, పాల్ రవీంద్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు చిన్నం.మణిబాబు, న్యాయవాదులు, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు, తదితరులు ఉన్నారు.