లక్ష్మీపురం: ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 24న ‘చలో పార్లమెంట్’ చేపట్టినట్లు సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు వెల్లడించారు. స్థానిక మార్కెట్ సెంటర్‌లోని ఆటో స్టాండ్‌ల వద్ద పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రవాణా రంగంపై పెద్దఎత్తున దాడి ప్రారంభించిందని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 106(1), (2)ను తీసుకురావడం చిన్న చిన్న తప్పిదాలకు కూడా డ్రైవర్లలను బాధ్యులు చేయటం, భారీ శిక్షలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. వాహనా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం కార్మికులపై భారాన్ని మోపడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో భారీ పెనాల్టీలు విధిస్తూ తీసుకొచ్చిన జీఓ నంబర్ 21ను తక్షణమే రద్దు చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నగర ఆటో డ్రైవర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు, వెంకట్, జానీ పాల్గొన్నారు.