నకరికల్లు: భూముల రీసర్వేను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మండలంలోని కండ్లకుంటలో సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు. రీసర్వేపై ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే సత్వరమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొలుత స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రాథమిక సేవలు, విద్యుత్ తదితర మౌలిక వసతులు తనిఖీ చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. అనంతరం చల్లగుండ్లలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపే పనులను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కూలీలతో మాట్లాడారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పని ప్రదేశాల్లో టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. పొలాల్లో చెరువులను తవ్వుకుంటున్న రైతులతో మాట్లాడి, పలు సూచనలు ఇచ్చారు. ఈ– శ్రమ కార్డ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్వే అండ్ రికార్డ్స్ అధికారి మధుకీర్తి, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఈఓ చంద్రకళ, పలు శాఖల అధికారులు ఉన్నారు.
కలెక్టర్ పి.అరుణ్‌బాబు మండలంలోని పలుచోట్ల పరిశీలన