నరసరావుపేట: రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయని ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో ఎండీయూ ఆపరేటర్లపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. దీని వలన జిల్లాకు చెడ్డపేరు వస్తుందన్నారు. బియ్యం సమయానికి పంపిణీ చేయాలని, నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తిరిగి అప్పగించి, మంచి బియ్యం తీసుకొని కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే పంపిణీ చేసే సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అందజేయాలన్నారు. ఫిర్యాదులు నమోదైన ఎండీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.నారదముని