రాయగడ: జిల్లాలోని గుడారి సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 31 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 26 వ్యక్తిగత సమస్యలు కాగా ఐదు గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిగణలోకి తీసుకుని సంబంధిత శాఖ అధికారులు వాటిని సత్వరంగా పరిష్కరించాలని నవీన్ నాయక్ ఆదేశించారు. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, లీడ్ బ్యాంక్ అధికారి దేవేంద్ర బవురి, ఏఎస్పీ బబులి నాయక్, గుడారి ఐఐసీ బిశ్వబందిని బాగ్ పాల్గొన్నారు.


