భువనేశ్వర్ : వార్షిక ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) ఈ ఏడాది నిర్వహించిన ప్లస్ టూ పరీక్షల ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ సోమ వారం ప్రకటించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నత మాధ్యమిక విద్యా మండలి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, వృత్తి విద్య నాలుగు విభాగాల ఫలితాలను ఒకే రోజున ఏకకాలంలో ప్రకటిస్తుందని తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, ఉన్నత విద్య ప్రవేశ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ సంవత్సరం అన్ని విభాగాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని విద్యాశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో ఈ సంవత్సరం నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు ప్లస్ టూ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 26న ముగిశాయి. సంబంధిత ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లోని ఎస్‌ఏఎంఎస్ కళాశాల లాగిన్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ డిజిలాకర్ ఖాతాల నుంచి కూడా తమ మార్క్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
నియమగిరిలో మళ్లీ ఏనుగుల బీభత్సం
రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో మళ్లీ ఏనుగుల గుంపు చొరబడింది. దీంతో ఆయా ప్రాంతాల్లొ నివాసాలు ఉంటున్న ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోయింది. తాజాగా కల్యాణ సింగుపూర్ సమితి నియమగిరి పర్వత ప్రాంతమైన లింగమజోల గ్రామంలో ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గల 10 పూరి గుడిసెలను ధ్వంసం చేశాయి. దాదాపు పదికి పైగా ఉన్న ఏనుగుల గుంపు గ్రామంలో చొరబడి ఇళ్లలో గల సామగ్రిని ధ్వంసం చేశాయి. వాటి రాకను గమనించిన గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీసి కొండల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అందరూ పడుకున్న సమయంలో గ్రామంలోకి ఒక్కసారిగా చొరబడిన ఏనుగుల గుంపు ఇళ్లలో గల నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను , ఇంటి సామగ్రిని ధ్వంసం చేశాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించి దాచుకున్న పంటలు ఏనుగుల పాలయ్యాయని బాధిత కుటుంబీకులు లబోదిబోమంటున్నారు. అదేవిధంగా గ్రామంలొ గల మామిడి, పనస, అరటి చెట్ల సైతం నాసనం చేశాయి.
మద్యం మత్తులో యువకుడు హల్‌చల్
● రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యాయత్నం
రాయగడ: మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాయగడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ యువకుడు రైల్ ట్రాక్‌పై తలను పెట్టి పడుకుని ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతనిని వారించి ట్రాక్ మీద నుంచి బయటకు తీసుకువచ్చారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో యువకుని ప్రాణాలు కాపాడగలిగారు. అయితే యువకుడు ఎవరు, ఎందుకు ఇలా ప్రయత్నించాడో తెలియాల్సి ఉంది.
వర్చువల్ విధానంలో ఉన్నత న్యాయ స్థానం కార్యకలాపాలు
భువనేశ్వర్: చమురు సంక్షోభం దృష్ట్యా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం వర్చువల్ విధానంలో పనిచేయనుంది. ఈ నెల 19, 21 తేదీల్లో న్యాయ స్థానంలో అన్ని ధర్మాసనాలు వర్చువల్ విధానంలో పని చేస్తాయి. ఈ ఏడాది వేసవి సెలవుల నిడివిలో న్యాయ స్థానం కార్యకలాపాలు వర్చువల్ విధానంలో కొనసాగుతాయి. ఈ విధానంలో కేవలం సగం మంది (50 శాతం) ఉద్యోగులు మాత్రమే కోర్టులో విధులకు హాజరవుతారు. ఉన్నత న్యాయ స్థానంలో వర్చువల్ విధానంలో కార్యకలాపాలకు సంబంధించి జుడీషియల్ విభాగం రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


