ఇచ్ఛాపురం రూరల్: లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన ఇసురు దానయ్య–శ్రావణి దంపతులకు చెందిన రెండు నెలల పసిపాప యామిని ప్రాణాల కోసం పోరాడుతోంది. జన్మతః మలవిసర్జనకు అవసరమైన మార్గం సరిగా ఏర్పడకపోవడంతో చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం పాప వయసు కేవలం రెండు నెలల 7 రోజులు మాత్రమే కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స కోసం మరో అత్యవసర ఆపరేషన్ అవసరమని సూచించారు. శస్త్ర చికిత్స, మందులు, ఆస్పత్రి ఖర్చులు కలిపి సుమారు నాలుగు లక్షలు అవసరమని వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించే చిన్నారి తల్లిదండ్రులు దానయ్య–శ్రావణి దంపతులకు ఈ భారీ ఖర్చు భరించడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు కుమార్తెల్లో చిన్న కుమార్తెకు ఈ సమస్య రావడంతో తమ కుమార్తెను కాపాడుకోవాలని తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. పాప ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని వారు అభ్యర్థిస్తున్నారు. మానవత్వంతో స్పందించి చిన్నారి ప్రాణాలను రక్షించాలని కుటుంబం వేడుకుంటోంది.
ఆర్థిక సాయం అందించే దాతలు 9986856973 నంబర్‌కు సంప్రదించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మల విసర్జన లోపంతో ఆస్పత్రి పాలు
కుమార్తెను దక్కించుకునేందుకు తల్లిదండ్రుల ఆరాటం
దాతల సాయం కోసం ఎదురు చూపులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
పసిపాప యామిని


