జయపురం: భువనేశ్వర్ హైటెక్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన అంతర్ రాజ్యస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ ప్రదర్శణ పోటీలలో కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థి ప్రశ్న హరిజన్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇతను కొరాపుట్ జిల్లా గుమడ ఉన్నత పాఠశాల కొట్‌పాడ్ విద్యార్థి. అతడు తన ప్రదర్శనతో ప్రథమ స్థానం పొంది నిర్వాహకుల ప్రశంసలు పొందాడు. ఈ పోటీలలో పలు రాష్ట్రాల నుంచి జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.
చైత్రపర్వం కోసం చందాలు వసూలు
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలలో చైత్ర పర్వం వచ్చిందటే చాలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నెలరోజులపాటు గిరిజనులు రోడ్లకు అడ్డంగా కర్రలు, తాళ్లు పెట్టి వాహనాలను నిలిపేసి చందాగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. డబ్బులను ఇవ్వనిదే వాహనాలను విడిచిపెట్టరు. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, అధికారుల వాహనాలను సైతం విడిచి పెట్టరు. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వలన చిల్లర లేకుండా పోయింది. పరిస్తితి గమనించిన గిరిజనులు స్కానర్‌లో డిజిటల్ చెల్లింపుతో చందాలు వసూలు చేస్తున్నారు. పొట్టంగి ప్రాంతంలో డిజిటల్ చెల్లింపు కోసం రోడ్డు మీద ఆదివారం గిరిజనులు కాపుకాశారు.
పెండిలి సర్పంచ్ రాజీనామా
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి పరిధి పెండి గ్రామ పంచాయతీ సర్పంచ్ రేణుక సబర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శనివారం గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, బీడీవో సుచిస్మిత బెహరకు అందజేశారు. జిల్లా విద్యాశాఖలో ఉద్యోగం రావడంతో తాను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమితిలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మూడు సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో జిల్లా యంత్రాంగం ఆదేశానుసారం నాయబ్ సర్పంచులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
బస్సులకు డీజిల్ సమస్య
కొరాపుట్: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒడిశా రోడ్డు ట్రాన్స్‌పోర్టు సర్వీస్ బస్సులకు డీజిల్ సమస్య ఏర్పడింది. కొరాపుట్ జిల్లా జయపూర్ నుంచి వెళ్తున్న 6 సర్వీసులను ముందస్తుగా ప్రకటించకుండా నిలపివేశారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకున్నవారికి సమాచారం ఇవ్వకపోవడంతో జిల్లావ్యాప్తంగా వందలాది మంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో పడిగాపులు కాశారు. ముఖ్యంగా పార్వతీపురం – నారాయణపట్న – జయపూర్ సర్వీసుకి ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో ఒకే బస్సు కావడంతో ప్రాధాన్యత ఉంది. రద్దయిన సర్వీసుల్లో ఈ బస్సు కూడా ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులకు డీజిల్ వేయడానికి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఓఎస్‌ఆర్టీసీకి ఒప్పందం ఉంది. యుద్ధం నేపథ్యంలో డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.17లక్షలు ఆ సంస్థకు బకాయి పడి ఉంది. దీంతో గత 10 రోజులుగా ప్రభుత్వం నుంచి బాకీ తీరుతుందని ఎదురుచూసిన ప్రైవేట్ సంస్థకి నిరాశ ఎదురైంది. దీంతో డీజిల్ వేయలేకపోవడంతో పార్వతీపురం, రాయగడ మీదుగా కటక్, పుల్బాణీ తదితర ప్రాంతాలకు సర్వీసులు నిలిచిపోయాయి.


