బహిరంగ మార్కెట్‌లో ఎల్‌పీజీ అమ్మకాలు నిషేధం | - | Sakshi
Sakshi News home page

బహిరంగ మార్కెట్‌లో ఎల్‌పీజీ అమ్మకాలు నిషేధం

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

గ్యాస్‌ బండల కోసం ఈ–కేవైసీ తప్పనిసరి: మంత్రి పాత్రో

భువనేశ్వర్‌: వంట గ్యాస్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎల్‌పీజీ లభ్యతపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై గ్యాస్‌ను స్వేచ్ఛగా విక్రయించరు. అలాగే 5 కేజీల సిలిండర్ల రీఫిల్లింగ్‌ను పూర్తిగా నిలిపి వేశారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలే ఈ నిర్ణయానికి కారణమని ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కష్ణ చంద్ర పాత్రో ప్రకటించారు. ఈ సంఘర్షణ బహిరంగ మార్కెట్లో గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడానికి దారి తీసింది. దీంతో సామాన్య వినియోగదారులు సరసమైన ధరలకు ఎల్‌పీజీని పొందడం మరింత కష్టంగా మారింది. తలెత్తుతున్న ఎల్‌పీజీ సంక్షోభం దృష్ట్యా బహిరంగ మార్కెట్‌లో గ్యాస్‌ అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇకపై 5 కేజీల సిలిండర్లలో గ్యాస్‌ నింపబడదు. పారదర్శకత నిర్ధారణ, దుర్వినియోగం నివారణ నేపథ్యంలో అన్ని గ్యాస్‌ లావాదేవీలకు ఇకపై ఈ–కేవైసీ తప్పనిసరి అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

తమ సొంత పేరు మీద ఎల్‌పీజీ కనెక్షన్‌ నమోదు చేసుకున్న వారు మాత్రమే అధీకృత గ్యాస్‌ ఏజెన్సీల నుంచి సిలిండర్లను పొందగలుగుతారు. రాష్ట్రంలో గ్యాస్‌ లేదా పెట్రోల్‌ కొరత లేదు. బ్లాక్‌ మార్కెట్‌ పరిస్థితులు ఇంత వరకు తలెత్తలేదని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. దేశీయ ఎల్‌పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతుంది. సాధారణ గృహ అవసరాలను తీర్చడానికి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అభయం ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన ప్రపంచ సరఫరా గొలుసు సవాళ్ల నేపథ్యంలో పంపిణీని క్రమబద్ధీకరించి రాయితీతో కూడిన ఎల్‌పీజీ వాస్తవ లబ్ధిదారులకు చేరేలా చూడటమే ఈ నిర్ణయం లక్ష్యంగా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ప్రధాన పట్టణ ప్రాంతాలలో పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ) పంపిణీని కూడా వేగవంతం చేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement