రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా, యువజన సాధికారత శాఖ సూచనల మేరకు కొనసాగుతున్న పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం సామూహిక పరుగు పందాల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా పోటీలను ప్రారంభించారు. స్థానిక కాళీ మందిరం నుంచి ప్రారంభమైన పోటీలు సాధన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒడియా భాషా దినోత్సవం సందర్భంగా కొనసాగుతున్న పక్షోత్సవాల్లో భాగంగా పరుగు పందాలను జిల్లా యంత్రాంగం నిర్వహించిందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, ఏపీడీ విజయ్ నాయక్, జిల్లా సాంఘీక భద్రత శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి పాల్గొన్నారు. పోటీల్లో వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


