కొలువుదీరిన ఘటాలు | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన ఘటాలు

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

●కొనసాగుతున్న మజ్జిగౌరీ చైత్రోత్సవాలు

రాయగడ: చల్లని తల్లి మజ్జిగౌరీ చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు కొలువదీరాయి. అమ్మవారి గర్భగుడికి సమీపంలో గల ప్రత్యేక గదిలో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా బాల పేరంటాలుగా వీటిని ముస్తాబు చేసిన అనంతరం భక్తుల దర్శనార్ధం ఘటాలను ఉంచారు. ఘటాలను పూజించి దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. పళ్లు, పసుపు, కుంకుమ, గాజులు తదితరమైనవి ఘటాల ముందు పెట్టి పూజించారు. తమ కోర్కెలు తీర్చాలని మొక్కుకుని భక్తులు అమ్మవారి ప్రతిరూపాలకు పసుపును అద్దుతారు.

నగర పరిక్రమణ

అమ్మవారి ఘటాలు పురవీధుల్లో తిప్పుతారు. దీనినే నగర పరిక్రమణగా పిలుస్తారు. సోమవారం సాయంత్రం ఈ ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. దుష్టశక్తులు లోపలకు చొరబడకుండా అమ్మవారు ఇలా నగర పరిక్రమణ పేరిట తిరిగి ప్రజలను వాటి నుంచి కాపాడుతారని స్థల పురాణం. అదేవిధంగా సంప్రదాయాలకు అనుకూలంగా ఘటాలను పూజించి ఊరేగించారు. ఇలా ఉత్సవాలు ముగింపు వరకు కొనసాగుతాయి. ఈ ఘటాల ఊరేగింపు సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ వాయిద్యాలు ఘటాల ముందు ఉంటాయి. వీటతో పాటు చాకలి మండుతున్న దివిటీని పట్టుకుని ఘటాల ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే మంగలి అమ్మవారి పాల జంగిడి వద్ద రత్నాల పొదిగిన గొడుగును పట్టుకుని ఉంటారు. అమ్మవారి ఘటాలు ఊరేగింపు సమయంలో పుర ప్రజలు అమ్మవారి ఘటాల్లో పళ్లు, ఫలాలతో పాటు బియ్యం, చిల్లర పైసలను వేస్తారు. ఇలా ఘటాల్లో వేసిన అనంతరం పూజారి పసుపు బియ్యంతో తయారు చేసిన బొట్టును అందిస్తారు. ఈ బొట్టును నుదట పెట్టుకోవడంతో పాటు చిన్న పిల్లలకు నీళ్లలో ఆ బొట్టును వేసి తాగిస్తారు. ఇలా చేస్తే ఏ దుష్టశక్తి పిల్లల దరిచేరదన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇదే తరహా ఉత్సవాల్లో కొనసాగుతుండటం విశేషం.

చండీహోమం

అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం చండీ హోమం . ఉత్సవాల ప్రారంభమైన రెండో రోజు నుంచి చండీ హోమాన్ని నిర్వహిస్తారు. అందుకు గంజాం జిల్లా నుంచి ప్రత్యేకంగా పురోహితుల బృందాన్ని రప్పించారు. మూడు రోజుల పాటుగా ఈ హోమం కొనసాగుతుంది. ఏప్రిల్‌ రెందో తేదీ వరకు కొనసాగే హోమం రాత్రి పూర్ణహుతితో ముగుస్తుంది. సోమవారం సూర్య వాహన పూజల్లో భాగంగా హోమం నిర్వహించే ప్రాంగణంలో జగన్నాధుని చిత్రాన్ని పిండితో పురోహితులు వేశారు. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల్లో మందిరం కమిటీ సభ్యులు రాయిసింగి బిడిక, ఇప్పిలి సన్యాసిరాజు, పాలకొండ ప్రకాష్‌, వడ్డాది శ్రీనివాసరావు, పెద్దీన వాసు దంపతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement