రాయగడ: స్థానిక పెద్ద పోస్టాఫీసు సమీపంలోని సంతోషిమాత మందిరం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మందిరంతో పాటు శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, సంపత్ వినాయక, విశ్వకర్మ విగ్రహాల పునఃప్రతిష్టోత్సవాలు అత్యంత ఘనంగా సోమవారంతో ముగిశాయి. గత నెల 28వ తేదీ నుంచి ప్రతిష్టోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి వచ్చిన ప్రముఖ పండితులు వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి. విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకులు పొట్నూరి భాస్కరరావు నేతృత్వంలో విగ్రహ, కొత్తగా నిర్మించిన మందిర ప్రతిష్టోత్సవాలు జరిగాయి. సోమవారం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛణల మధ్య పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనంతరం జరిగిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదో తరం వారసులు వీరభద్ర స్వామి దంపతులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, మంజుల మినియాకలు పూర్ణాహుతి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన అరటికట్ల సత్యనారాయణ, కడారి శ్రీను, రాలి రవికేశవ, అంపల్లి నాగరాజు, మాధవ ఆచారి సంఘం సభ్యులు పాల్గొన్నారు.


