భువనేశ్వర్: రాష్ట్రంలో వైద్య రంగంలో సంచలనాత్మక సదుపాయాలు కల్పిస్తున్న హై టెక్ వైద్య విద్యా బోధన సముదాయం సరికొత్త వైద్య, చికిత్స హంగుల్ని ప్రవేశ పెట్టింది. హై టెక్ వైద్య బోధన ఆస్పత్రిలో కొత్త ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, అత్యాధునిక ఎక్స్ రే వ్యవస్థని ప్రారంభించారు. వీటి సేవల్ని సాధారణ ప్రజా సేవలకు అంకితం చేసినట్లు హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. హై టెక్ ఆస్పత్రి సముదాయం 2వ అంతస్తులో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యాధునిక 800 ఎస్‌ఏ డీఆర్‌ఎఫ్ ఎక్స్ రే వ్యవస్థ ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. అవయవ మార్పిడి వంటి అత్యంత క్లిష్టమైన చికిత్స విధానంలో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ విభాగం దోహదపడుతుంది. ఈ సందర్భంగా డెర్మటాలజీ, జనరల్ సర్జరీ విభాగాల భవన సముదాయం విస్తరించారు. ఈ అత్యాధునిక వ్యవస్థతో, రోగులు చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స, అవయవ మార్పిడి సౌకర్యాలను పొందగలరని చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ మధుస్మిత త్రిపాఠి, ప్రొఫెసర్ రవీంద్రనాథ్ బెహెరా, సీఓఓ డాక్టర్ జ్యోతిర్మయి పండా, వైద్యులు, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.


