కొరాపుట్: కొందమాల్‌లో మావోయిస్టుల లొంగుబాటుపై మాజీ కానిస్టేబుల్, బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హర్షం వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లిలో మావోయిస్టుల సమస్యపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత పాలకులు మావోయిస్ట సమస్యపై ఏనాడు దృష్టి సారించలేదన్నారు. మావోయిస్టులు పోలీసులపై దాడి చేసేవారన్నారు. తిరిగి పోలీసులు కూడా మావోయిస్టులపై దాడి చేయడానికి వెళ్తే అడ్డుకొనేవారని వాపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మావోయిస్టుల సమస్య 2026 మార్చి ఆఖరు అంతం చేస్తామన్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఒడిశాలోని 30 జిల్లాలకు గాను కేవలం కొందమాల్ జిల్లాలోనే మావోయిస్టుల సమస్య ఉందన్నారు. ప్రస్తుతం కొందమాల్‌లో రూ.55 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కోసా సోడి అలియాస్ సుక్రు తన అనుచరులతో లొంగిపోవడంలో పోలీసుల కృషిని అభినందించారు. మావోయిస్టుల పునరావసంలో ఒడిశా ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందనన్నారు. వారికి ఉపాధి, ఇల్లు, నెలవారీ పింఛన్, రివార్డు (నగదు), తదితర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అందువలన రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్లు అధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులు, మరో 27 మంది సీనియర్ మావోయిస్టులు లొంగిపోయారన్నారు. అదేవిధంగా మావోయిస్టుల ప్రాంతంలో పని చేసే పోలీసులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. డీవీఎఫ్, ఎస్‌ఓజీ పోలీసులకు రూ.20 వేలు అధికంగా వేతనం ఇస్తున్నామన్నారు.
మల్కన్‌గిరి కలెక్టర్ కిడ్నాప్‌పై అనుమానాలు..
గతంలో మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినిల్ కృష్టని మావోయిస్టులు అపహరించుకుపోయిన విషయం అసెంబ్లీలో లేవనెత్తారు. ఆ రోజు కలెక్టర్ కిడ్నాప్ విషయం అందరూ టీవీలలో చుశామన్నారు. కానీ మరునాడు మావోయిస్టుల చెరలో ఉన్న కలెక్టర్ ఇసీ్త్ర చేసిన దుస్తులతో ఫొటోల్లో కనిపించారన్నారు. కిడ్నాప్ అయిన వ్యక్తికి దట్టమైన అడవిలో ఇసీ్త్ర చేసిన దుస్తులు ఎలా లభించాయన్నారు. అంతేకాక పూర్తి షేవింగ్‌తో కనిపించారన్నారు. నాడు బీజేడీ పాలకులకు మావోయిస్టులకు ఉన్న సంబంధాలను ఈ ఘటన రుజువు చేస్తుందన్నారు. నాడు రాష్టంలో కందిపప్పు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ నాటకం ఆడారన్నారు.


